లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మ‌స్క్‌ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో!

  • స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు
  • లక్షల కోట్ల సంపద ఉన్నప్పటికీ టెక్సాస్‌లో చిన్న ఇంట్లో నివాసం
  • సుమారు 50,000 డాలర్ల విలువైన ఇంటిని స్పేస్‌ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న మ‌స్క్‌
  • ఆయన నిరాడంబరతపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
  • మస్క్ జీవనశైలి తన పనికి దగ్గరగా ఉండేందుకు ఎంచుకున్న మార్గమని పలువురి విశ్లేషణ
టెక్నాలజీ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రపంచ చరిత్రలోనే ఒక అపూర్వమైన మైలురాయిని చేరుకున్నారు. తన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ పబ్లిక్‌గా ట్రేడ్ అవ్వడంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించారు. అయితే ఇంతటి అపార సంపద ఉన్నప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవనశైలి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యంత నిరాడంబరంగా ఒక‌ చిన్న ఇంట్లో  ఇంట్లో ఆయన నివసిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మారిన భవిష్యత్తు
ఇటీవల స్పేస్‌ఎక్స్ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఒక్కో షేరును 135 డాలర్లకు విక్రయించడంతో, కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఆ తర్వాత రోజు ట్రేడింగ్‌లో షేరు విలువ దాదాపు 20 శాతం పెరిగి 162 డాలర్లకు చేరుకుంది. దీంతో స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీలలో మస్క్‌కు ఉన్న వాటాలను కలుపుకుంటే, ఆయన నికర సంపద ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.

50,000 డాలర్ల ఇంట్లో జీవనం
లక్షల కోట్ల సంపదకు అధిపతి అయినా, మస్క్ ప్రధాన నివాసం టెక్సాస్‌లోని బోకాచికాలో స్పేస్‌ఎక్స్ స్టార్‌బేస్ సమీపంలో ఉన్న ఒక చిన్న ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇల్లు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ కథనం ప్రకారం ఈ ఇంటి విలువ కేవలం 50,000 డాలర్లు (దాదాపు రూ.40 లక్షలు) మాత్రమే. 2020లో టెక్సాస్‌కు మారిన తర్వాత మస్క్ కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన ఆస్తులన్నింటినీ అమ్మేశారు. "నా ప్రధాన నివాసం స్పేస్‌ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న 50,000 డాలర్ల ఇల్లే" అని 2021లోనే మస్క్ స్వయంగా ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

బాక్సబుల్ (Boxabl) అనే స్టార్టప్ నిర్మించిన ఈ ఇల్లు కేవలం 20x20 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఒక లివింగ్ ఏరియా, బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్ మాత్రమే ఉంటాయి. అయితే, మస్క్‌కు సంబంధించిన కంపెనీల పేరు మీద ఆస్టిన్‌లో 6,000 నుంచి 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్విమ్మింగ్ పూల్స్‌తో కూడిన మూడు విలాసవంతమైన గృహాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

పనికే ప్రాధాన్యం
మస్క్ ఎప్పుడూ తన కంపెనీలకు దగ్గరగా ఉండటానికే ఇష్టపడతారు. టెస్లా మోడల్ 3 ఉత్పత్తిలో సమస్యలు వచ్చినప్పుడు, ఆయన కాలిఫోర్నియా ఫ్యాక్టరీలోనే నిద్రపోయేవారు. ఆయన జీవిత చరిత్ర రచయిత వాల్టర్ ఐజాక్సన్, మస్క్ నివసించే ఇంటి ఫొటోను పంచుకుంటూ, "రెండు బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ నిరాడంబరమైన ఇంట్లోని చెక్క టేబుల్ వద్ద కూర్చునే మస్క్ ఫోన్ కాల్స్ చేస్తుంటారు" అని వివరించారు.

ఇటీవల మస్క్ తల్లి మాయే మస్క్ కూడా ఆయన ఇంటి గురించి చెబుతూ, "ఫ్రిజ్‌లో ఆహారం లేదు. నేను గ్యారేజ్‌లో పడుకున్నాను. బాత్రూంలో ఒకే టవల్ ఉంది, అది ఎలాన్ కోసం వదిలేశాను. నాకు ఇది పెద్ద విషయమేమీ కాదు" అని ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో భిన్న వాదనలు
మస్క్ జీవనశైలిపై ఇంటర్నెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "ట్రిలియనీర్ అయినా మస్క్ సాధారణ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన డబ్బును చూసి కోపపడేవాళ్లు బహుశా అసూయతో లేదా కమ్యూనిస్ట్ భావజాలంతో బాధపడుతున్నవారే" అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మరొకరు "ఆయన సంపదను ప్రదర్శించట్లేదు. ఆయన సంపదలో 99% కంపెనీల పనితీరుతో ముడిపడి ఉంది" అని సమర్థించారు.

అయితే, కొందరు దీన్ని కేవలం ప్రచార వ్యూహంగా కొట్టిపారేస్తున్నారు. "ఇదంతా ప్రజల మనిషిగా కనిపించడానికి చేసే ట్రిక్స్. తన కంపెనీల ద్వారా ఆస్తులు కొంటూ, సంపదను పోగేస్తూ, తన అనుచరులు మాత్రం అతను నిరాడంబరుడని నమ్మేలా చేస్తున్నాడు" అని ఒక రెడ్డిట్ యూజర్ ఆరోపించారు. మొత్తానికి మస్క్ జీవనశైలి ఆయన సృష్టించే సంచలనాల అంతే ఆసక్తికరంగా మారింది.

Elon Musk
SpaceX
World First Trillionaire
Tesla
Elon Musk Texas House
SpaceX IPO

More Telugu News